Skip to main content

అహంకారం అసలు శత్రువు

అహంకారమే అసలు శత్రువు!
ఒకసారి ఓ సింహం అడవిలోంచి పోతూ చెదపురుగుల పుట్టపై కాలు వేసింది. వెంటనే అవి ఒక్కసారిగా అరిచాయి. సింహం మరింత రెచ్చిపోయి పుట్టను నేలమట్టం చేసింది. 'అడవికి రాజైనంత మాత్రాన సరిపోతుందా..? కాసైనా హుందాతనం ఉండక్కర్లేదా?! మా పుట్టను ఇలా ఎందుకు నాశనం చేశావు' అని అడిగాయని కోపంగా. దానికి ఆ సింహం వెటకారంగా నవ్వుతూ.. ఉఫ్ అంటే ఎగిరిపోతారు, కంటికి సరిగా కనిపించనైనా కనిపించరు, మృగరాజునైన నన్నే ఎదిరిస్తారా మీరు?' అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వెళ్లిపోయింది. చెదపురుగులకు చాలా కోపం వచ్చింది. 'ఎలాగైనా ఆ సింహం పొగరు అణచాలి' అని అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశాయి. అప్పటి నుంచీ కనిపించిన చెట్లనూ, మొక్కల్నీ పట్టాయి. చూస్తుండగానే కుందేళ్లూ, జింకలూ, దుప్పుల్లాంటి జంతువులకు ఆహారం దొరక్కుండా చేశాయి. దీంతో ఆ జీవులన్నీ అడవిని వదిలి మరోచోటకు వెళ్లిపోయాయి. వేటాడదామంటే  కనిపించకపోయే సరికి సింహం అవాక్కైంది. తన తాతముత్తాతల నుంచీ వారసత్వంగా వస్తున్న గుహను తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. గత్యంతరం లేక మరో అడవిలోకి అడుగుపెట్టింది. చెదపురుగులతో తాను అలా ప్రవర్తించి ఉండకపోతే తనకిప్పుడు ఈ అవస్థ ఉండేది కాదు కదా అనుకుంది. ఇకపై ఎవరితోనూ అహంకారపూరితంగా
వ్యవహరించకూడదని బుద్ధి తెచ్చుకుంది.

Comments