అమ్మ మాట
ఒక అడవిలో ఒక అల్లరి కోతిపిల్ల ఉండేది. అది ఎవరి మాటా వినేది కాదు. ఆ అడవిని ఆనుకుని ఒక పెద్ద చెరువు ఉంది. అందులో ఒక చిన్న తాబేలుపిల్ల ఉండేది, కోతిపిల్లకు దానితో చెలిమి కుదిరింది.
కోతిపిల్లకు తాను గూడా తాబేలులాగా నీటిలో తిరగాలని చాలా కోరిక, కానీ దానికి ఈత రాదు. దాంతో ఒక చిన్నపడవ తయారు చేసింది. దానిలో ఎక్కి తాబేలుతోబాటు చెరువంతా తిరగసాగింది. అది చూసి కోతిపిల్ల తల్లి "పాపా... ఏదయినా ఆపద వచ్చినప్పుడు నిన్ను నీవు కాపాడుకోనన్నా కాపాడుకోగలగాలి లేదా కాపాడే వాడన్నా పక్కనుండాలి. అందుకే చెరువులో షికారు చేయొద్దు" అంది. కానీ కోతిపిల్ల అమ్మకి తెలియకుండా అలాగే తిరగసాగింది.
ఒకసారి కోతిపిల్ల చెరువులో తిరుగుతుంటే పెద్దగాలి వీయసాగింది. చెరువంతా అల్లకల్లోలమై అలలు ఎగిసిపడసాగాయి. పడవ అటూయిటూ ఊగిపోసాగింది. దానిలోకి నీళ్ళు ఎగిరి పడసాగాయి. దాంతో పడవ కొంచం కొంచం మునిగిపోసాగింది. అది చూసి తాబేలు "రా... తొందరగా వచ్చి నా మీదకు ఎక్కు నిన్ను వేగంగా ఒడ్డుకు తీసుకుపోతాను" అంది. కోతిపిల్ల సరేనని తాబేలు మీదకు ఎక్కింది.
కానీ తాబేలేమో చిన్నది. కోతి పిల్లేమో పెద్దది. దాంతో దాని బరువును మోయలేక నీళ్ళలోకి మునిగిపోతూ 'నా బలం సరిపోవడం లేదు. తొందరగా ఎవరినన్నా పిలువు' అంది. కోతిపిల్ల భయంతో కాపాడమని గట్టిగా కేకలు వేయసాగింది.
ఆ అరుపులు చెరువుకు కొంచం దూరంలోనే వున్న కోతిపిల్ల తల్లికి వినిపించాయి. పరుగెత్తుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. చెరువు పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది. దాని కొమ్మలు చెరువుపైకి పెరిగి ఉన్నాయి. వెంటనే వేగంగా చెట్టు మీదకు ఎక్కి, నీళ్ళపైన పెరిగిన కొమ్మ అంచుకు చేరి, "పాపా... రా... వచ్చి నా తోక గట్టిగా పట్టుకో” అని అరిచింది. తాబేలు పెద్దకోతిని చూసింది. బలమంతా ఉపయోగించి ఈదుతూ అక్కడికి చేరుకొంది. వెంటనే కోతిపిల్ల ఛటుక్కున ఎగిరి అమ్మతోక పట్టుకొంది. నెమ్మదిగా ఎక్కుతూ చెట్టుపైకి చేరుకుంది.
దాంతో ఆ కోతిపిల్లకు పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఎంతో ఆలోచించి చెబుతారని తెలిసివచ్చింది. ఆరోజు నుంచీ అమ్మమాట ఎప్పుడూ జవదాటలేదు.
Nice story
ReplyDeleteNice moral
ReplyDelete